Koti Deepotsavam 2024 Day 1 : ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటిరోజు విజయవంతం చేశారు.
కోటి దీపోత్సోవంలో మొదటి రోజులో భాగంగా.. దీప యజ్ఞం ఘనంగా నిర్వహించారు. తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ.. నంబూరు శ్రీకాళీ వనాశ్రమాధిపతి యోగిని శ్రీచంద్ర కాళీ ప్రసాద మాతాజీ గార్లు అనుగ్రహ భాషణం చేశారు. బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరు శ్రీనివాసరావు ప్రవచనామృతం వినిపించారు. ఆ తర్వాత.. సమస్త పుణ్య నదుల జలాలతో కాశీస్పటిక లింగానికి సహస్రకలశాభిషేకం చేశారు. అంతేకాకుండా.. భక్తులతో కోటిమల్లెల అర్చన కార్యక్రమం నిర్వహించారు. కోటి దీపోత్సవం వేదికపై కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం కూడా జరిపించారు. ఆ తర్వాత హంసవాహనంపై ఆదిదంపతులు భక్తులకు దర్శనం ఇచ్చారు. చివరలో సప్త హారతి, లింగోద్భావంతో మొదటి రోజు కోటి దీపోత్సవం వేడుక విజయవతంగా ముగిసింది.