
శ్రీ కృష్ణుడికి వచ్చిన రోగానికి తమ పాద ధూళితో అనుపానం చేసేందుకు గోపికలు ముందుకు వచ్చారు. అయితే దీనిపై నారదుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిదేవునికి అనుపానంగా ఆరగించమని అరికాలి మట్టి ఇస్తారా? పాపం కాదా? మీకు నరకభయం లేదా? అని నారదుడు మండిపడ్డారు. గోపికలు- ‘దేవర్షీ! మా దేహ-గేహాలు, మా సుఖ-దుఃఖాలు, మా చావు-బ్రతుకులు, మా భోగ-మోక్షాలు, మా స్వర్గ-నరకాలు.. ‘వాసుదేవ స్సర్వం’- అన్నీ వాసుదేవుడే ఆయన కోసం మేము ఎన్ని పాపాలైనా భరిస్తాం. ఎన్ని నరకాలైనా అనుభవిస్తాం. మహర్షీ! మీరేదో పాప(అఘం)మనీ, నరకమనీ అన్నారే.. మా శ్యామ సుందరుడు మాకోసం అఘాసురుణ్ణి (పాపమనే రాక్షసుని), నరకాసురుణ్ణి ఎప్పుడో సంహరించాడు. మీకు తెలియదా? స్వామీ! మాకు తెలిసింది ఒక్కటే. శ్రీకృష్ణుల వారి సుఖమే మా సుఖం’ అన్నారు.
పవిత్ర ప్రేమాశ్రుధారతో దేవర్షి వక్షఃస్థలం తడిసిపోయింది. రాధాదేవి ఆమె అంశలే అయిన గోపికల పాదధూళి సేకరించి నారదుడు కొంత ధూళితో తన్నుతాను అభిషేకించుకొని మిగిలిన దాన్ని జాగ్రత్తగా మూట కట్టుకొని, భరతుడు రామపాదుకలు ధరించినట్లు తలపై పెట్టుకొని, నామ సంకీర్తనతో నృత్యం చేస్తూ ద్వారక వచ్చి పరమాత్మకు సమర్పించగా స్వామి స్వీకరించి స్వస్థుడయ్యాడు. గోవింద పత్నులకు గర్వ భంగం కాగా సిగ్గుతో తలదించుకున్నారు. గోపీభావం గ్రహించి, మన్నించమని గోపాలదేవునికి శరణాగతి చేశారు. అప్పటి నుంచి ప్రేమపాఠం ఓనమాలు దిద్దటం ప్రారంభించారు. ‘తత్సుఖే సుఖిత్వం- మాధవుని సుఖమే మా సుఖం’ ఇదే గోపీత్వం.. గోపి భావం.. మనసులో పరమాత్మ వచ్చి చేరనంత వరకు ఎట్టివారైనా ‘గోపిక’ కాలేరు.
