శబరిమలకు వెళ్లాలనుకునేవారికి శుభవార్త

శబరిమల అయ్యప్ప భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ప్రతి ఏడాది శబరిమల వెళ్లేందుకు భక్తులు కొన్ని నెలల ముందు టికెట్లు బుక్ చేసుకుంటే కానీ రిజర్వేషన్ దొరకదు. ఈసారి అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలి కాలంలో ఐఆర్‌టీసీ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ప్రత్యేక రైలు సౌకర్యాన్ని సౌకర్యవంతమైన ధరలతో భక్తుల ముందరకు తీసుకు వస్తోంది. దీనిలో భాగంగానే పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ దేఖో అప్నా దేశ్‌లో భాగంగా భారత్‌ గౌరవ్‌ రైలును తీసుకువచ్చింది.

తాజాగా దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు సైతం ప్రత్యేక టూరిస్ట్‌ రైలును నడపబోతోంది. ఈ రైలులో యాత్ర నిర్వహించాలనుకునే భక్తులు నవంబర్‌ 16 నుంచి 20 వరకు పర్యాటక యాత్ర కొనసాగిస్తారు. దీనికి సంబందించన బ్రోచర్‌ను ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆవిష్కరించారు. ఈ పర్యటన నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు యాత్ర కొనసాగించనుంది. ఈ పర్యటనలో భక్తులు శబరిమల అయ్యప్ప ఆలయంతో పాటు ఎర్నాకులం చోటానిక్కర భగవతి అమ్మవారి ఆలయం దర్శించవచ్చు. ఈ యాత్ర నాలుగు రాత్రులు, ఐదు పగళ్ల పాటు కొనసాగుతుంది. టికెట్‌ ధరలు రూ.11,475 నుంచి మొదలవుతాయి. ఈ రైలు నవంబర్ 16న సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో రైలు ఆగుతుంది. మరుసటిరోజు రాత్రి 7గంటలకు కేరళ చెంగనూరుకు చేరుతుంది.

అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నీలక్కళ్‌కు.. అక్కడి నుంచి సొంత ఖర్చులతో కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వరకు ప్రయాణం చేస్తారు. మూడో రోజు అయ్యప్ప స్వామి దర్శనానంతరం చోటానిక్కర భగవతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి ఎర్నాకులం రైల్వేస్టేషన్‌కు చేరుకొని ఐదురోజు రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. ఇక ప్యాకేజీ ధర ఎకానమీ అయితే ఒక్కో టికెట్ ధర రూ.11,475, 5 నుంచి 11 సంవత్సరాల మధ్య చిన్నారులకు విత్‌ బెడ్‌తో రూ.10,655, థర్డ్‌ ఏసీ కేటగిరిలో రూ.18,790, చిన్నారులకు రూ.17,700.. సెకండ్‌ ఏసీ కేటగిరికి రూ.24,215 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలోనే మూడు పూటలా భోజన సదుపాయంతో పాటు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ అవుతాయి.

Share this post with your friends