ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి రోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. అదే విధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు రెండు లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీరు నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో భక్తులకు అందించవలసిన ఆహార పదార్థాలను నిర్ణయించినట్లు తెలిపారు.
ఇందుకోసం ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి, వారు సూచించిన విధంగా అన్నప్రసాద భవనంలో సిబ్బందిని పెంచడం, వంటశాలల ఆధునీకరణ, మెరుగైన పారిశుధ్య నిర్వహణ, తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్నప్రసాదాలలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను మరింత పెంపొందించేందుకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వారి సహకారంతో అత్యాధునిక నూతన ల్యాబ్ ను తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్ఎస్ డి) వారు ఏర్పాటుచేసిన మొబైల్ ల్యాబ్ లో 80 రకాల పదార్థాలను పరీక్షించవచ్చని చెప్పారు.
భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూలైన్ల వద్ద ఆరు వేల మంది వేచి ఉండేలా నూతన షెడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగు నీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరివేక్షించేలా ప్రత్యేకంగా ముగ్గురు ఏఈఓలకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. క్యూలైన్లలో మూడు చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం స్టాండర్డ్స్ ప్రకారము నాణ్యమైన నెయ్యి, ముడి సరుకులు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
తిరుమలలో హోటల్ నిర్వాహకులు టీటీడీ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, రేట్లు ఉండాలన్నారు. హోటల్ లీజు దారులు సబ్ లీజుకు ఇవ్వకూడదని, తదితర అంశాలతో నూతన పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. టీటీడీ ఐటి వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనము, వసతి తదితర సేవల బుకింగ్ లో లోపాలను సరిదిద్దుతామన్నారు. గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్ఎస్ డి టోకెన్లను, భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.47 లక్షలు ఇస్తున్నామని, వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు.