టీటీడీ స్థానిక ఆలయాల్లో మంగళవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తిరుచానూరులో…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీ కృష్ణస్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. తరువాత గోపూజ, గోకులాష్టమి ఆస్థానం జరిగింది. అదేవిధంగా ఆగష్టు 28న ఉట్లోత్సవంను పురస్కరించుకొని మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామి వారికి స్నపన తిరుమంజనం, తరువాత ఊంజల్‌సేవ జరుగనుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం 4.30 గంటలకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, పురాణ పఠణం, ఆస్థానం నిర్వహించారు.
నారాయణవనంలో…
నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం, శుద్ది నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం, నివేదన నిర్వహించారు. ఆగస్ట్ 28వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.