శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో ఆగస్ట్ 27వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. గోకులాష్టమి రోజున ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ జరుగనుంది.
రాత్రి 7 నుండి 8.15 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు గోపూజ, గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్ట్ 28న ఉట్లోత్సవంను పురస్కరించుకొని సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ స్వామివారికి ఊంజల్‌సేవ జరుగనుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారికి ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు. ఈ కారణంగా ఆగస్ట్ 27న ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.