కన్నుల పండువగా గోదా కల్యాణం

టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో బుధవారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది. ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు. ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతంగా అలరించింది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించింది. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు.

సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆతరువాత మహా సంకల్పం, స్వామి,అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది. టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల్ దీక్షితులు, ఎస్వీ సంగీతనృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా ముద్దు బాల తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends