స్వర్ణరథంపై ఊరేగిన దేవదేవుడు

శ్రీవారి సాలకట్ల వార్షిక‌ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలకమైన గరుడ వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. దీనిలో భాగంగా 6వ రోజైన బుధవారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించారు. స్వర్ణ రథంపై దేవదేవుడిని చూసేందుకు భక్తులకు రెండు కళ్లూ చాలలేదు.

దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారి కరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం. స్వ‌ర్ణ‌ ర‌థోత్స‌వంలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు దంప‌తులు, అదనపు ఈవో సి సి హెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీ మ‌తి గౌతమి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్ఓ శ్రీ శ్రీధర్, సీఈ శ్రీ సత్యనారాయణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends