వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కల్యాణం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం 4.30 గంటలకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు.

అనంతరం గురువారం రాత్రి 7 గంట‌లకు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా స‌ర్వభూపాల‌ వాహనంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెబుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు. వాహ‌న సేవ‌లో ఏఈఓ శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణ బట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ కుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా.. ఇవాళ ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.

Share this post with your friends