వైభవంగా చక్రస్నానం.. చక్రతాళ్వార్లకు అభిషేకం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా వివిధ రకాల వాహన సేవలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ క్రమంలోనే మధ్యాహ్నం స్వామివారికి చక్రస్నానం నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

రథసప్తమి సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలలో భక్తుల సౌకర్యాలను మంగళవారం ఉదయం టిటిడి ఈవో శ్రీ జె.శ్యామల రావు పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఉదయం అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం రాత్రి నుంచి క్రమంగా అన్నప్రసాదాలు అందుతున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాలరీలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వాహన సేవల విరామ సమయాల్లో గ్యాలరీలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

Share this post with your friends