యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సింహాచలం, అరుణాచలం మాదిరిగా గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షణకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆలయ అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. వాస్తవానికి గతంలో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తూ ఉండేవారు. అయితే 2016లో ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇది నిలిచిపోయింది. ఇప్పుడు దీనిని తిరిగి ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ ఇక్కడ గిరి ప్రదక్షిణ స్థానిక భక్తులే నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటి నుంచి స్థానికేతరులు సైతం గిరి ప్రదక్షిణ చేయనున్నారు.
యాదగిరిగుట్ట కొండపై జ్వాలా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, యోగ నారసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు స్వయంభువులుగా వెలసిన పంచ నారసింహక్షేత్రంగా ఇది దేశంలోనే ప్రసిద్ధి గాంచింది. ఆలయ వైకుంఠ ద్వారం నుంచి గిరి ప్రదక్షిణి ప్రారంభమవుతుంది. తిరిగి వైకుంఠ ద్వారం వద్ద ముగుస్తుంది. రాష్ట్రంలో తొలి గిరి ప్రదక్షణ ఆలయంగా యాదగిరి గుట్ట రికార్డు సాధించింది. గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కూడా గిరిప్రదక్షిణను ప్రారంభించడంతో భక్తులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు.