
కశ్యపుడు, వినతల కుమారుడు గరుడుడు అని తెలుసుకున్నాం కదా. అలాగే కద్రువ, వినత పందెం గురించి కూడా తెలుసుకున్నాం. ఒక కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొద్దికాలం తరువాత గర్బవతి అయిన వినత, తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బయటకు వచ్చాడు. ఆ తరువాత వినూరుడు.. ‘అమ్మా నీ తొందరుపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను. కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు’ అని చెప్పి , సూర్యభగవానుడి రథసారధిగా వెళ్ళిపోయాడు.
కొద్దికాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం.. తల్లి ఋణం తీర్చుకోవాలని.. ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని, పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ , ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి.. అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతా శ్రేష్టులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధం చేశారు.
పెట్రేగిపోయిన గరుడుడు స్వర్గాన్ని చీకటి మయం చేసి, తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు , రుద్రులు , అశ్వనీ దేవతలూ , కుబేరుడు , వాయువు , యముడు అందరినీ ఎదుర్కొని , ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. గరుత్మంతుడు అమృతం తీసుకొనిపోతుండగా.. విష్ణువు అతడిని సమీపించి , ‘‘నీ విజయ సాధనకు మెచ్చాను. ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు. ‘‘నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి’’ అంటాడు గరుత్మంతుడు. తనకు వాహనంగా.. జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు.
