తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో గండి వీరాంజనేయ స్వామివారి ఆలయం ఒకటి. స్వామివారికి ఓ భక్తుడు వెండి తమలపాకుల దండను బహూకరించడం ఆసక్తికరంగా మారింది. ఈ దండ కోసం 540 గ్రాముల వెండిని వినియోగించినట్టు భక్తుడు తెలిపాడు. 54 తమలపాకులతో ఈ దండను తయారు చేయించి ఈ వెండి మాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్‌కు అందజేశారు. అనంతరం సదరు వెండి మాలను బహూకరించిన భక్తుడికి వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ స్వామివారిని భక్తులు ఏం కోరిక కోరుకున్నా తప్పక నెరువేరుస్తాడని నమ్మకం. ఆ రకంగానే స్వామివారు బాగా ఫేమస్ అయ్యారు.
ప్రతి మంగళ, శనివారాలతో పాటు శ్రావణమాసంలో గండి వీరాంజనేయ స్వామికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. గండి క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటి-వేంపల్లె మార్గమధ్యంలో పాపఘ్ని నదీతీరాన వెలసింది. పాపఘ్నీ నది ఇక్కడ శేషాచలం కొండను రెండుగా చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది. ఇక్కడ వెలిసిన ఆంజనేయుడు.. గండి వీరాంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందాడు. ఈ ఆలయ విశేషం ఏంంటే.. ఈ ఆలయంలో ఓ బంగారు తోరణం ఉంటుంది. అది మహా పురుషులకు తప్ప కనిపించదట. అది చూసిన మహా పురుషులు సైతం ఆరు నెలల్లోగా మరణిస్తారని అంటారు. అప్పట్లో దత్తమండలాలకు కలెక్టర్‌గా ఉన్న థామస్ మన్రోకు ఈ బంగారు తోరణం కనిపించిందట. ఆ తరువాత ఆరు నెలలకే ఆయన మరణం సంభవించింది.