దర్భ వినాయకుడికి అత్యంత ప్రియమైన వాటిలో ఒకటని మనం తెలుసుకున్నాం. దర్భను వినాయకుడికి సమర్పిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నాం. అసలు దర్భ.. వినాయకుడికి అంత ఇష్టమైనదిగా ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పురాణం ప్రకారం పురాతన కాలంలో అనలాసురుడు అనే రాక్షసుడి కారణంగా ఋషులు, దేవతలు, మానవులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారట. దీంతో దేవతలంతా వెళ్లి శివుడికి మొర పెట్టుకోవడంతో గణేషుడు మాత్రమే అనలాసురుడిని సంహరించగలడని చెప్పాడట. దీని తరువాత దేవతలందరూ కలిసి తమను రక్షించమని వినాయకుడిని వేడుకున్నారట.
అప్పుడు గణేశుడు రాక్షసుడి వద్దకు చేరుకొని అనలాసురుడిని మింగేశాడట. ఆ తరువాత వినాయకుడికి గుండెల్లో మంట ప్రారంభమైందట. అప్పుడు విషయాన్ని వినాయకుడు కశ్యప మహర్షికి వివరించాడట. తనను కడుపు మంట నుంచి బయట పడేయాలని కశ్యపుడిని వినాయకుడు కోరాడట. అప్పుడు కశ్యపు మహర్షి గణపతి తినడానికి దర్భ గడ్డిని ఇచ్చాడట. అప్పటికి కానీ గణపతి గుండెల్లో మంట చల్లారిందట. అప్పటి నుంచి గణపతికి దర్భ గడ్డి ప్రియమైన వస్తువుల్లో ఒకటిగా మారిందట. దీంతో భక్తులు సైతం గణేశుడికి దర్భలను సమర్పించడం సాంప్రదాయంగా మొదలైంది. దర్భలను సమర్పిస్తే వినాయకుడు ప్రసన్నం అవుతాడని నమ్మకం.