ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం మహా పూర్ణాహుతితో తొమ్మిది రోజుల పాటు జరిగిన గణేశ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇవాళ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 7న వినాయక చవితి రోజున ఈ నవాహ్నిక కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి రోజు శ్రీ వినాయకుడిని వేర్వేరు అలంకారాలతో వేర్వేరు వాహనాలపై పూజించారు. వాహన సేవకు ముందు అంకురార్పణం, పుణ్యాహ వాచనం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠాపన, వరసిద్ధి వినాయక స్వామి పూజ, సూర్యపూజ, సోమనాథ పూజ, ద్వారపూజ, గణపతి హోమం, శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వంటి అనేక క్రతువులు ప్రతిరోజూ నిర్వహించారు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 7న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి తిరుచ్చిపై దర్శనమిచ్చారు. సెప్టెంబరు 8న ఉదయం బాల గణపతిగా, సాయంత్రం సృష్టి గణపతిగా గజ వాహనంపై, సెప్టెంబర్ 9న ఏకాక్షర, ఏకదంత గణపతిగా మయూర వాహనంపై, సెప్టెంబర్ 10న దుర్గా గణపతి, దుండి గణపతిగా పులి వాహనంపై దర్శనమిచ్చారు. సెప్టెంబరు 11న శ్రీ రుణ విమోచక, విజయ గణపతిగా హంస వాహనంపై, సెప్టెంబర్ 12న యోగ, క్షిప్రగణపతిగా అశ్వ వాహనంపై, సెప్టెంబరు 13న సింహ వాహనం వీరగణపతిగా, సెప్టెంబరు 14న మహా గణపతి, వృషభంపై, చివరి రోజైన సెప్టెంబర్ 15న ఆదివారం శ్రీ సిద్ధి బుద్ధి గణపతి మూషిక వాహనంపై అనుగ్రహించారు. నిన్న సాయంత్రం ధ్వజావరోహణం నిర్వహింయాకెరు. గణపతి విగ్రహానికి ప్రత్యేక పంచామృత అభిషేకం చేసిన అనంతరం ఇవాళ ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య నిమర్జనం నిర్వహిస్తారు.