ప్రకృతి ప్రేమికులంతా మట్టి గణపతికే ప్రాధాన్యమిస్తారు. ఇంట్లోనూ చక్కగా మట్టితో సహజ రంగులతో వినాయకుడిని అందంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మార్కెట్‌లో వినాయకుడి ప్రతిమలు తయారు చేసుకోవడానికి మౌల్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి.. అలాగే బంక మట్టిని తెచ్చుకుంటే అద్భుతంగా వినాయకుడిని తయారు చేయవచ్చు. మనకు దొరికే కూరగాయలు, పువ్వుల నుంచి సహజమైన రంగులు చాలా వస్తాయి. వాటిని వినియోగిస్తే అందమైన గణపతి సిద్ధమవుతాడు. పైగా పర్యావరణానికి సైతం మట్టి గణపతి కారణంగా ఎలాంటి నష్టమూ వాటిల్లదు.
ఒకవేళ ఒండ్రు మట్టి దొరకలేదంటే పరిస్థితి ఏంటని అనుకోవచ్చు. పసుపుతో చక్కగా గణపతిని తయారు చేసి ఇంట్లోని లవంగాలు లేదంటే మిరియాలతో కళ్లను పెట్టవచ్చు. దీంతో వినాయకుడు చాలా అందంగా తయారవుతాడు. ఇక సహజమైన రంగులు ఉండనే ఉన్నాయి. అంటే ఆకుల నుంచి కూరగాయలు, పువ్వుల నుంచి రకరకాల రంగులు మనకు అందుబాటులో ఉంటాయి. వాటితో ఆకర్షణీయంగా విఘ్నేశ్వరుడిని మూర్తిని తయారు చేయవచ్చు. ఇలా తయారు చేసినా వినాయకుడిని నిమజ్జనం చేయడం వలన నీరు కలుషితం కాదు.. పైగా పర్యావరణానికి వచ్చే నష్టమూ ఏమీ లేదు. పైగా మన చేతితో తయారు చేసుకుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది.