గణపతి విగ్రహాల నిమజ్జనం కోసం గణేష్ శోభాయాత్ర దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీనికి ముందు లడ్డూ వేలం పాట మరింత ఆసక్తికరంగానూ.. ఉత్కంఠభరితంగానూ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూనే హాట్ టాపిక్‌గా ఉండేది. గత ఏడాది నుంచి మాత్రం సీన్ మారిపోయింది. ఓ విల్లాకు చెందిన లడ్డూ వేలం పాట మరింత హాట్ టాపిక్‌గా మారింది. భాగ్యనగరమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ లడ్డూ వేలం పాట రికార్డ్ సృష్టించింది. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
గణేష్ నిమజ్జానికి ముందు కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో లడ్డూ వేలం పాట జరిగింది. ఈ లడ్డూ వేలం ఎంతకు పోయిందో విని అంతా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకూ లక్షల్లోనే ఉన్న లడ్డూ వేలం ఈ విల్లాస్ మాత్రం దాదాపు రెండు కోట్లు పలికింది. గతేడాది కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేషుడి లడ్డు ఒక కోటి 26 లక్షల రూపాయలు పలకగా.. ఈ ఏడాది ఏకంగా ఒక కోటి 87 లక్షల రూపాయిలు పలికింది. అయితే ఈ లడ్డూను ఒక్కరే సొంతం చేసుకోలేదు. 26 మంది ఓ బృందంగా ఏర్పడి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ కోటి 87 లక్షల రూపాయలను ఈ విల్లాస్‌కు చెందిన గణపతి ట్రస్ట్ పేదలకు వినియోగించనుంది. ఈ డబ్బులతో పేద ప్రజలు, హాస్టల్స్‌లోని విద్యార్ధులకు సాయం అందించనున్నట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.