ఇవాళ ఉదయం నుంచే గణేష్ నిమజ్జనం ప్రారంభమైంది. బుజ్జి బుజ్జి గణపయ్యలు సహా ఖైరతాబాద్ వినాయకుడు హుస్సేన్ సాగర్ దిశగా నేడు అడుగులు వేస్తున్నారు. ఒకవైపు డప్పు చప్పుళ్లు, మరోవైపు డీజే సౌండ్లతో.. భాగ్యనగరం మారుమోగుతోంది. వేలాది మంది గణనాథులు హుస్సేన్ సాగర్ దిశగా అడుగులు వేస్తున్నారు. భక్తజన సందోహం నడుమ.. జై జై గణేశా, బై బై గణేశా నినాదాల నడుమ వినాయకుడు హుస్సేన్ సాగర్‌కు పయనమయ్యాడు. డీజే సౌండ్లకు భాగ్యనగరమే ఊగిపోతోంది. గణేష్ నిమజ్జనానికి పోలీసులు 25 వేల మంది భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ట్యాంక్ బండ్ సహా పెద్ద, చిన్న చెరువులలో గణేష్ నిమజ్జనం నిర్వహిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 3 వేల మంది పోలీసులు, మహిళల రక్షణ కోసం 12 షీటీమ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 733 సీసీ కెమెరాలతో నిమజ్జనాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ గణేష్ నిమజ్జనంలో పాల్గొనే భక్తుల కోసం మెట్రో సమయాలను పొడిగించారు. అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు ప్రజల కోసం అందుబాటులో ఉండనున్నాయి. నిమజ్జనం తరువాత ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. ఇక మెహదీపట్నం నుంచి వచ్చే బస్సులను మాసబ్ ట్యాంక్ దగ్గర..కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులను ఖైరతాబాద్ వరకూ.. సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులను చిలకలగూడ క్రాస్ రోడ్ వరకే అనుమతిస్తున్నారు.