వినాయకుడి ఆలయాలకు కొదువేం లేదు. ప్రతి ఒక్క గ్రామంలోనూ ఉంటాయి. అలాగని కొండ కోనల్లో ఉండవని కాదు.. అక్కడ కూడా ఉన్నాయి. ఒక ఎత్తైన పర్వతం మీద ఏకాంతంగా పూజలను అందుకునే వినాయకుడి గురించి దాదాపు ఎవ్వరికీ తెలియదు. అక్కడి స్థానికులకు మాత్రమే తెలుసు. ఎత్తైన పర్వతంపై వినాయకుడు పూజలందుకుంటోంది మరెక్కడో కాదు. మన దేశంలోనే.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న రాతిపై ఒక చిన్న స్థలంలో విఘ్నేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలోని బైలాడిలాలోని ధోల్కల్ కొండపై ఉందీ గణపతి విగ్రహం.
పురాణాల ప్రకారమైతే ఈ కొండపైనే గణేశుడు, పరశురాముడి మధ్య యుద్ధం జరిగినట్లు ప్రతీతి. అప్పుడు పరుశురాముడి గొడ్డలి వినాయకుడి దంతానికి తగిలి విరిగిపోయిందట. చిందక నాగవంశీ రాజులు కొండపై 11వ శతాబ్దంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఈ యుద్ధం యావత్ మానవాళికి గుర్తుండిపోయేలా చేశారని చెబుతారు. ఇక ఈ విగ్రహం 6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పుతో చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ వినాయకుడు 4 చేతులతో మనకు దర్శనమిస్తాడు. ఒక చేతిలో కొడవలి, మరో చేతిలో విరిగిన దంతం, ఇంకో చేతిలో అభయ ముద్రలో హారం, నాలుగవ చేతిలో మోదకం ఉంటాయి. ఇక్కడి స్థానిక గిరిజనులు ఏకదంతాన్ని తమ రక్షకుడిగా భివించి పూజిస్తూ ఉంటారు.