
ఆధ్యాత్మికతకు నెలవైన భారతదేశంలో అద్భుతాలకు కొదువ లేదు. ప్రతి ఆలయం ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇప్పటికీ సైన్స్ ఛేదించలేని రహస్యాలు మన దేశంలోని ఆలయాల్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో ఉంది. మనం ఏ ఆలయం లేదంటే ఇంట్లో దీపాలను నూనెతో వెలిగిస్తాం. మరి నీటితో వెలిగిస్తే వెలుగుతాయా? సాధ్యమే కాదు కదా.. కానీ ఈ ఆలయంలో మాత్రం దేదీప్యమానంగా వెలుగుతాయి. మరి ఆ ఆలయం షాజాపూర్ జిల్లాలో ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం.
నీటితో దీపాలు వెలిగించే ఆలయం శాస్త్రవేత్తలకు సైతం సవాలుగానే మారింది. ఇక్కడ నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారం కాదిది. వందల ఏళ్లుగా ఈ ఆలయంలోని దీపాలు నీటితోనే వెలుగుతున్నాయి. ఈ ఆలయం షాజాపూర్ జిల్లా కేంద్రం నుంచి 15 కి.మీ దూరంలో నల్ఖేడా సమీపంలో ఉంది. ఆలయాన్ని గడియాఘాట్ వలీ మాతాజీ అని పిలుస్తారు. కాళీసింధ్ నది ఒడ్డున వలీ మాతాజీ కొలువై ఉంది. ఈ ఆలయంతో ప్రతి రోజూ సాయంత్రం నీటిని ఉపయోగించి దీపాలను వెలిగిస్తారు. ఉదయం అవగానే ఈ దీపాలు వాటంతట అవే ఆరిపోతాయి. తిరిగి సాయంత్రం ఆ దీపాలను నీటితో మళ్ళీ వెలిగిస్తారు.
