తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉద్యోగులందరూ భక్తులలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వారికి అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల ఆస్థాన మండపంలో మంగళవారం జరిగిన బ్రహ్మోత్సవాల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆలయ, వసతి విభాగాల ఉద్యోగులను ఉద్దేశించి అదనపు ఈవో మాట్లాడుతూ, ప్రపంచం నలుమూలల నుండి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తుంటారని తెలిపారు. విభిన్న ప్రాంతాలు, భాషలు, సంస్కృతికి చెందిన వ్యక్తులతో సేవా భావంతో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు.
యాత్రికులకు అవసరాలపై మెరుగైన సమాచారం అందించడానికి, టీటీడీ వివిధ కార్యకలాపాల గురించి తెలియజేయడానికి టీటీడీకి సంబంధించిన సమస్త సమాచారం తెలుసుకోవాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. తద్వారా యాత్రికుల దృష్టిలో సంస్థ ప్రతిష్టను మెరుగుపరచడంలో ఈ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. అనంతరం అక్టోబరు నెలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నద్ధం కావాలని ఉద్యోగులను కోరారు. తర్వాత ఉద్యోగుల నుంచి ఆయన అభిప్రాయాన్ని స్వీకరించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పని చేయాలని ఆకాంక్షించారు.