వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి. ఒకరకంగా చెప్పాలంటే ఈ గణపతి వరల్డ్ ఫపపేమస్. అలాగే ప్రపంచ రికార్డ్‌ను సృష్టించిన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసుకోనున్నాడు. అందంలో కూడా ఖైరతాబాద్ వినాయకుడిని మరే వినాయకుడు బీట్ చేయడంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో రూపొందిన పూర్తి మట్టి విగ్రహంగా ఖైరతాబాద్ వినాయకుడు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈసారి వినాయకుడి ఎత్తు ఎంతో తెలుసా? ఏకంగా 70 అడుగులు. అంత ఎత్తైన మట్టి వినాయకుడిని రూపొందించడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. అందుకే తన రికార్డును తానే బ్రేక్ చేయనున్నాడు.
ప్రస్తుతం ఖైరతాబాద్ వినాయకుడికి నిపుణులు తుది రూపును ఇస్తున్నారు. గణపయ్యకు కళ్లు దిద్దుతున్నారు. ఇది పూర్తైతే పూర్తి స్థాయిలో వినాయకుడు సిద్ధమైపోయినట్టే. మరికొద్ది గంటల్లో భక్తుల చేత పూజలందుకుంటాడు. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని 70 అడుగుల ఎత్తులో రూపొందించినందుకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. వాస్తవానికి తొలిసారిగా మహా గణపతిని 1954లో పెట్టారు. ప్రస్తుతం ఖైరతాబాద్ వినాయకుడికి 70 ఏళ్లు. కాబట్టి 70 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించాలని నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలోనే 70 అడుగులతో భక్తుల పూజలందుకునేందుకు ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమైపోయాడు.