దసరా పండుగ వచ్చిందంటే చాలు.. తెలంగాణలో ధూం ధామే. అలాగని మిగిలిన రాష్ట్రాల్లో జరగవని కాదు కానీ తెలంగాణలో మరికొంత స్పెషల్. శరన్నవరాత్రి ఉత్సవాలు అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున జరుగుతాయి. ముఖ్యంగా కర్ణాటకలోని మైసూర్‌లో ఇప్పటికే దసరా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏనుగులు. ఈ నేపథ్యంలోనే 9 ఏనుగులు మైసూర్‌కు చేరుకున్నాయి. వీటికి శిక్షణ ఇస్తున్నారు. ఆ తొమ్మిది ఏనుగుల ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.
అభిమన్యు: 58 ఏళ్ల ఈ ఏనుగు 1970లో కొడగు జిల్లాలోని హెబ్బల్లా అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు. దీనికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. 2012 నుంచి అభిమన్యు దసరా వేడుకల్లో పాల్గొంటోంది. మైసూర్ ఆర్కెస్ట్రా రథాన్ని ఇది లాగుతుంది. గత 4 సంవత్సరాలుగా అయితే బంగారు బండారాన్ని మోస్తోంది.
ఏకలవ్య: 39 ఏళ్ల ఏకలవ్య 2022లో ముదిగెరె అటవీ ప్రాంతంలో పట్టుబడింది. ఇది దసరా వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి.
ధనంజయ: 44 ఏళ్ల ధనుంజయ 2013లో హాసన్ జిల్లా యసలూరు అటవీ ప్రాంతంలో పట్టుబడింది. అడవి, పులుల ట్రాపింగ్ ఆపరేషన్‌లలో ఇది దిట్ట. గత 6 సంవత్సరాలుగా టైటిల్ ఏనుగుగా దసరా వేడుకల్లో పాల్గొంటోంది.
వరలక్ష్మి: 68 ఏళ్ల వరలక్ష్మి 1977లో కాకనకోటే అటవీ ప్రాంతంలో పట్టుబడింది. దసరా వేడుకల్లో పాల్గొనడం ఇది పదోసారి.
భీమా: 24 ఏళ్ల భీమాను 2000 సంవత్సరంలో భీమనకట్టే అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు. అడవి పిల్లి, పులుల వేటలో ఇది దిట్ట. 2017 దసరా మహోత్సవాల్లో పాల్గొంటోంది.
లక్ష్మి: 23 ఏళ్ల లక్ష్మి.. తల్లి నుంచి విడిపోయి 2002లో అటవీ అధికారులకు దొరికింది. ఇది గత 3 సంవత్సరాలుగా దసరా మహోత్సవాల్లో పాల్గొంటోంది.
రోహిత్: ఈ ఏనుగు 2001లో హెడియాల అటవీ ప్రాంతంలో 06 నెలల పిల్లగా ఉన్నప్పుడు దొరికింది. ఈ ఏనుగు గతేడాది నుంచి దసరా వేడుకల్లో పాల్గొంటోంది.
గోపి: 42 ఏళ్ల గోపి 1993లో కారెకొప్ప అటవీ ప్రాంతంలో పట్టుబడింది. ఈ ఏనుగు 13 ఏళ్లుగా దసరా వేడుకల్లో పాల్గొంటోంది.
కంజన్: 25 ఏళ్ల కంజన్ 2014లో హసన్ జిల్లా యసలూరు అటవీ ప్రాంతంలో పట్టుబడింది. పులి, ఏనుగుల క్యాప్చర్ ఆపరేషన్‌లలో దిట్ట. గతేడాది నుంచి దసరా ఉత్సవాల్లో పాల్గొంటోంది.