హనుమంతుడు మనకు అష్ట సిద్ధులను ప్రసాదిస్తాడని అంటారు. మరి ఆ అష్టసిద్దులు ఏంటంటే… ‘బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్’ అంటారు. హనుమంతుడిని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే. సూర్యునితో పాటు తిరుగుతూ హనుమంతుడు విద్య నేర్చుకున్నాడని అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదా మరి? అనే సందేహం కొందరికి రావొచ్చు. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.

హనుమంతుని పంచ ముఖములు..
హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు, హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే… తూర్పున వానర ముఖం జన్మతః వచ్చినది అది సద్యోజాత శివవదనము.
దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.
పశ్చిమం గరుడ ముఖం. అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.
ఉత్తరం వరాహ ముఖం. అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ. శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు.
ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం. వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య, త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది.
