ఒక్కో వారం ఒక్కో దేవుడు.. ఎవరెవరిని ఎలా పూజించాలి?

హిందువులు ఒక్కో వారం ఒక్కో దేవుడికి ఇష్టమైన రోజుగా కొలుస్తూ ఉంటారు. రోజూ దేవుడిని పూజించడం వలన జీవితంలో పాజిటివిటీ నెలకొనడంతో పాటు అశాంతి దూరమై.. ఆనందం, ఆత్మవిశ్వాసం చేరవవుతుంది. ఇక వారంలోని ఏడు రోజులూ ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడికి అంకితమై ఉంది. మరి ఏ రోజు ఎవరికి? ఆ రోజున ఎలా పూజించాలో తెలుసుకుందాం. సోమవారం శివుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని పూజించి అభిషేకిస్తే మంచి జరుగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. మంగళవారం హనుమంతుడికి అంకితం. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే జీవితంలో భయాలు, అడ్డంకులన్నీ తొలగిపోయి ధైర్యంతో పాటు ఏ కార్యాన్నైనా సఫలం చేసుకోగల శక్తి లభిస్తుంది.

బుధవారం విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని, అయ్యప్ప స్వామిని పూజిస్తే చాలా మంచింది. పూజిస్తే జ్ఞానం, తెలివి లభిస్తుందని నమ్మకం. జీవితంలోని అడ్డంకులను తొలగించడానికి గణేశుని ఆరాధన ముఖ్యం. గురువారం విష్ణుమూర్తిని పూజిస్తే సామరస్యం, స్థిరత్వం, ఆధ్యాత్మిక వృద్ధికి మార్గం సుగమమవుతుందట. శుక్రవారం లక్ష్మీదేవి లేదంటే దుర్గమ్మను ఆరాధిస్తే ఆర్థిక వృద్ధి ఉంటుంది. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున వేంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే శనివారం శనీశ్వరుడికి కూడా ఇష్టమైన రోజు. ఈ రోజున శనీశ్వరుడికి నువ్వుల దీపం వెలిగిస్తే శని దోషాలు పోతాయి. ఆదివారం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడిని పూజించే వారికి మంచి ఆరోగ్యం, శక్తి లభిస్తాయట.

Share this post with your friends