శ్రీవారికి అలంకరించే పూలమాలలకు ఒక్కో దానికి ఒక్కో పేరు.. అవేంటంటే..

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. అందుకే ఆయన తోమాల సేవ పేరిట రెండు సార్లు అలంకరణ చేస్తారు. స్వామివారికి సువాసనాభరిత పుష్పాలంటే చాలా ఇష్టమట. అందుకే 12 రకాల పుష్పాలు.. 6 రకాల పత్రాలతో అల్లిన దండలను నిత్యం అలంకరిస్తూ ఉంటారు. ఇక అలంకరణ వచ్చేసి శ్రీవారి పాదాల మొదలు కిరీటం వరకూ చేస్తారు. ఆపాదమస్తకం శ్రీవారికి అలంకరించే పూల మాలలకు ప్రత్యేక పేర్లున్నాయి. శ్రీవారికి పాదాలపై అలంకరించే మాలను ‘తిరువడి దండలు’ అని పిలుస్తారు. ఇక కిరీటం నుంచి రెండు భుజాల వరకూ అలంకరించే మాలను ‘శిఖామణి’ అని పిలుస్తారు.

శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకూ అలంకరించే పొడవాటి మాలను ‘సాలగ్రామ మాల‘ అని.. శ్రీవారి మెడలో రెండు పొరలుగా భుజాలమీదకి అలంకరించేమాలను ‘కంఠంసరి’ అని.. శ్రీవారి నందకఖడ్గానికి అలంకరించే మాలను ‘కఠారిసరం’ అంటారు. రెండు మోచేతుల కింద నుంచి పాదాల వరకూ హారాలుగా వేలాడదీసే మాలను ‘తావళములు’ అంటారు. ఇక శ్రీవారికి అలంకరించే మాలలో ఏ ఏ పుష్పాలను వాడతారంటే.. మల్లె, మందారం,సంపంగి, పారిజాతం, చామంతి, జాజి, వీరజాజి, కలువలు, కమలాలు, కనకాంబరాలు, మొల్ల, మొగలి, గులాబీలు, మరువం, ధమ్మానం మావి, మాచి, వట్టి వేరు, కురువేరులు, గన్నేరు, నంది వర్ధన, హరిత హార్ధ్ర బిల్వ తులసీ దళాలను వినియోగిస్తారు.

Share this post with your friends