అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ చల్లని తల్లి. కోరిన వరాలిచ్చే కల్పతరువు. లక్ష్మీ, సరస్వతి, పార్వతుల మూలమైన దుర్గమ్మ. మరికొద్ది రోజుల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలకు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శిస్తే ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా పొందవచ్చనని శాస్త్ర వచనం. ఈ నేపథ్యంలో కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. వారిి కోసం కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఏడాది అమ్మవారి శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, ప్రతిరోజూ చేసే అలంకరణ విశేషాలు గురించి తెలుసుకుందాం.
ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 03వ తేదీన ప్రారంభం కానున్నాయి. 3న గురువారం ఘట స్థాపనతో ప్రారంభమై.. అక్టోబర్ 12, శనివారం విజయ దశమి వేడుకతో ముగియనున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనుంది. అవేంటో చూద్దాం.
3/10/2024 గురువారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారం
4/10/2024 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ గాయత్రీ దేవి అలంకారం
5/10/2024 శనివారం ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
6/10/2024 ఆదివారం ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం
7/10/2024 సోమవారం ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ మహా చండీ దేవి అలంకారం
8/10/2024 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ పంచమి,షష్ఠి శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం
9/10/2024 బుధవారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి,సప్తమి శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూల నక్షత్రం)
10/10/2024 గురువారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి,అష్టమి శ్రీ దుర్గా దేవి అలంకారం (దుర్గాష్టమి )
11/10/2024 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి,నవమి శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం (మహర్నవమి)
12/10/2024 శనివారం ఆశ్వయుజ శుద్ధ దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం (విజయదశమి)