ఈ ఏడాది చివరి అమావాస్య ఎప్పుడనే విషయమై సందేహం నెలకొంది. ఈ నెల 30న అని కొందరు.. 31న అని కొందరు అంటున్నారు. అమావాస్య తిథి రోజున కొన్ని పరిహారాలు చేయడం వలన విశేషం ఫలితం ఉంటుంది. ఆ కారణంగా అమావాస్య తిథి ఎప్పుడనేది కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అమావాస్య తిథి రోజున పూర్వీకులకు తర్పణం విడవడం, పిండ ప్రదానం చేయడం వలన విశేష ఫలితాలుంటాయి. వేద క్యాలెండర్ ప్రకారం మార్గశిర అమావాస్య రోజున శివుడు, విష్ణుమూర్తిలను పూజిస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే దానం చేసినా కూడా మంచి జరుగుతుందట.
అమావాస్యనాడు శివుడు, విష్ణుమూర్తిలను పూజిస్తే ఎవరైనా తెలిసీ తెలియక చేసిన పాపాల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. వైదిక క్యాలెండర్ ప్రకారం ఈసారి మార్గశిర మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి డిసెంబర్ 30 తెల్లవారుజామున 4.01 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున 3.56 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం దేనినైనా జరుపుకుంటాం కాబట్టి మార్గశిర అమావాస్య 30 డిసెంబర్ 2024న జరుపుకుంటాం. ఈ ఏడాది అమావాస్య కూడా సోమవారం వస్తుంది కాబట్టి చాలా ప్రత్యేకం. దీనిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు.