
బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ శ్రీ మధుసూధన్ తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ భరత్ కుమార్, శ్రీనవీన్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఈ నెల 14న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
వీకెండ్స్.. అది కూడా ఆదివారం భక్తుల రద్దీ బీభత్సంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇవాళ కూడా కాస్త ఎక్కువగానే భక్తుల రద్దీ ఉంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా.. శనివారం శ్రీవారిని 75,140 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీమలయప్ప స్వామివారి హుండీ ఆదారం రూ.3.76 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,246 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
