
చంద్రుని అష్టమి కళ ఏ తిధిన ఉంటుందో దానిని అష్టమి తిథి అంటారు. అష్టమిరోజున చంద్రుడు సమంగా ఉంటాడు. అంటే అర్ధచంద్రుడు. అగ్నిపురాణంలో అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది. వాస్తవానికి చంద్రుడికి పదహారు కళలున్నాయి. పాడ్యమి దగ్గర నుంచి పూర్ణిమ వరకు తిథులు పదిహేను పదహారవకళ సాక్షాత్తూ సచ్చిదానంద స్వరూపిణి అయి ఉన్నది. చంద్రుని పదహారు కళలు సూర్యునిలో దాగి ఉంటాయి. శుద్ధపాడ్యమి అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి చంద్రునిలో ప్రవేశిస్తుంది.
ఆరకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజును పూర్ణిమ అంటారు. ఆ తరువాత ప్రతిరోజూ ఒక్కొక్క కళ చంద్రుని నుంచి విడిపోయి సూర్యునిలో చేరిపోతుంది. ఈ రకంగా పదిహేను కళలు చంద్రుని వదలి వెళ్ళిపోయిన రోజును అమావాస్య అంటారు. ఆ రోజు చంద్రుడు కళావిహీనుడై కనిపిస్తాడు. ఇక శుక్ల, కృష్ణ పక్షాలు రెండింటిలోనూ కూడా అష్టమి నాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు. అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు. ఇతడే అర్ధచంద్రుడు. తిథులు నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. నిత్యలు మొత్తం పదహారు. వీటిని గురించి వశిష్ట సంహితలో వివరించబడింది.
