కేరళలో అతి పెద్ద పండుగ ఓనం. దీనిని మలయాళీలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. పది రోజుల పాటు కేరళలో సందడి వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులంతా ఒకచోట చేరి సంప్రదాయ ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తారు. పడవ పందేలు.. సాంస్కృతిక కార్యక్రమాలతో ఓనం పండుగ అద్భుతంగా చేసుకుంటారు. ఈ పండుగను బలి చక్రవర్తిని భూమి మీదకు ఆహ్వానిస్తూ చేసుకుంటారు. అసలు బలి చక్రవర్తిని ఎందుకు భూమి మీదకు ఆహ్వానిస్తారు? అసలు ఈ పండుగ వెనుక కథేంటో తెలుసుకుందాం. వాస్తవానికి ఈ పండుగకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకునే కథ.. బలి చక్రవర్తికి సంబంధించినది.
రాక్షస రాజు అయినప్పటికీ బలి చక్రవర్తి చాలా దయగల రాజు.. పైగా దాన గుణంలో మిన్న. భూమిని రాక్షసుల నుంచి రక్షించడానికి శ్రీ మహా విష్ణువు వామన అవతారం ఎత్తి ఆయన దగ్గరకు వెళ్లాడు. మూడు ఆడుగుల నేలను దానంగా అడిగి ఒక అడుగు భూమిపై.. మరో అడుగు ఆకాశంపై పెడతాడు. మూడో అడుగుకు చోటేదని విష్ణుమూర్తి అడగ్గా తన తలను బలి చక్రవర్తి చూపిస్తాడు. అంతే బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. అయితే విష్ణువుకి మూడో అడుగుగా తన తలని ఇచ్చే ముందు తాను ప్రతి సంవత్సరం భూమిపైకి వచ్చే విధంగా బలి చక్రవర్తి వరం కోరాడంతో విష్ణువు అంగీకరించాడు. అప్పటి నుంచి బలి చక్రవర్తి భూమిపైకి వస్తాడని నమ్ముతూ ఓనం పండుగ నిర్వహిస్తారు.