
దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించుకోవడం ఆనవాయితీ. అసలు దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజించుకుంటామో తెలుసుకుందాం. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షికి ఒకరోజు దేవేంద్రుడు ఆతిత్యమిచ్చాడట. దానికి సంతోషించిన దుర్వాసుడు ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. దానిని ఇంద్రుడు తిరస్కార భావముతో తన వాహనం అయిన ఏనుగు మెడలో వేశాడట. ఆ హారాన్ని ఐరావతం కాలితో తొక్కివేసిందట. అది చూసిన దుర్వాసుడికి పట్టరాని కోపం వచ్చి దేవేంద్రుడిని శపించడంతో ఆయన రాజ్యాన్ని సిరి సంపదలను పోగొట్టుకున్నాడట. అప్పుడు దిక్కుతోచక ఇంద్రుడు శ్రీహరిని ప్రార్తించాడట.
పరిస్థితిని తెలుసుకున్న విష్ణుమూర్తి దేవేంద్రుడికి ఒక జ్యోతి ఇచ్చి దానిని వెలిగించి శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచించాడట. వెంటనే దేవేంద్రుడు విష్ణుమూర్తి చెప్పినట్టు చేయడంతో లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహించిందట. దీంతో తిరిగి దేవేంద్రుడికి త్రిలోకాధిపత్యంతో పాటు సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు లక్ష్మీదేవిని ఇంద్రుడు.. ‘తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా?’ అని అడిగాడట. దీనికి సమాధానంగా లక్ష్మీదేవి “నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా ప్రసన్నురాలౌతానని” సమాధానమిచ్చింది. అందుకే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
