భారతదేశంలో పరమేశ్వరుడికి సంబంధించి చాలా ఆలయాలున్నాయి. అయితే దాదాపుగా అన్ని ఆలయాల్లోనూ మనం శివుడిని లింగ రూపంలో పూజిస్తూ ఉంటాం. వాటిలో ముఖ్యమైనవి పంచభూత శివలింగాలు. ఈ పంచభూత శివలింగాల్లో నాలుగు దేవాలయాలు ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒక మిగిలిన ఐదో దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. పంచ భూత లింగాలను కార్తీక మాసంలో సందర్శిస్తే చాలా మంచిదని అంటారు. ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక పంచభూత లింగాల గురించి తెలుసుకుందాం.
ప్రకృతిలోని పంచభూతాలకు పంచభూత లింగాలను మనం ప్రతీకగా భావిస్తూ ఉంటాం. పంచభూత లింగాలు ఏవేంటంటే.. ఆకాశ లింగం, పృథ్వి లింగం, అగ్ని లింగం, జలలింగం, వాయు లింగం. పంచభూత లింగాలలో మొదటిదైన ఆకాశలింగం ఎక్కడుందో తెలుసుకుందాం. ఆకాశలింగం వచ్చేసి తమిళనాడు రాజధాని చెన్నైకి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిదంబరం క్షేత్రంలో ఉంది. ఇక్కడి క్షేత్రంలో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలతో పాటు వింతలూ ఉన్నాయి. ఇక్కడ పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాడు.