జాంబవంతుడు ప్రతిష్టించిన రాములవారి ఆలయం ఎక్కడుందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ‘వాయల్పాడు’ క్షేత్రంలో వెలసిన పట్టాభి రాముడి ఆలయ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. ఈ రామాలయం పురాతనమైన రామాలయంగా విరాజిల్లుతోంది. ఇక్కడి ఆలయంలో రాములవారు చాలా భిన్నంగా కనిపిస్తారు. ఇక్కడ సీతాదేవి స్వామివారికి కుడివైపు ఉండటం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. రాములవారు.. తిరుమల వేంకటేశ్వరస్వామి మాదిరిగా వైకుంఠ ముద్రను కలిగి ఉంటాడట. అలాగే రాముల వారు ఖడ్గాలు ధరించి ఉండటంతో స్వామివారిని ప్రతాప రామచంద్రుడని అంటారు. ఈ ఆలయంలో శ్రీరాముడిని జాంబవంతుడు ప్రతిష్టించాడట. గర్భాలయంలోని రాముడిని ఎంతసేపు చూసినా తనివి తీరదు.

స్థల పురాణం ప్రకారం వాయల్పాడును గతంలో వాల్మీకిపురం అని పిలిచేవారు. తొలుత జాంబవంతుడు రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్టించాడట. అనంతరం అవి మట్టిలో కూరుకుపోయాయట. వాల్మీకి అక్కడ తపస్సు చేసుకుంటుండగా ఆ విగ్రహాలు తిరిగి బయటపడ్డాయట. ఇక్కడ వాల్మీకి మహర్షి తపస్సు కూడా చేశారట. దీంతో వాల్మీకిపురం అని పేరు వచ్చింది. కాలక్రమంలో వాయల్పాడుగా మారింది. ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడ రామయ్య ఆలయం సువిశాలమైన ప్రదేశంలో, పచ్చని కొండల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే సకల పాపాలు పోతాయట. పైగా ఇక్కడి ప్రకృతి కారణంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Share this post with your friends