![]()
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చాలా ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు ఉన్నాయి. వాటిలో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. చిత్తూరు జిల్లా నాగలాపురంలో సాక్షాత్తూ గోవిందుడు మత్స్యావతారంలో వెలిశాడు. ఇక్కడ ప్రతి ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రస్తుతం అక్కడ బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు సైతం పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ గరుడ సేవ జరిగింది. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటో ముందుగా తెలుసుకుందాం.
నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం ఈనాటిది కాదు. దీనిని పల్లవుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయంలో మత్స్యావతారంలో సాక్షాత్తూ గోవిందుడు వెలియడం విశేషం. బ్రహ్మాండ పురాణం ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడిగా పేర్కొంటారు. దుష్ట శిక్షణ కోసం విష్ణుమూర్తి దశావతారాలను ధరించాడు. వాటిల్లో మొదటి అవతారం వేదాలకు పునర్జన్మను ప్రసాదించిన మత్స్యావతారం. స్వామి మత్స్య రూపంలోనే స్వయంభువుగా వెలసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురం. ఇక్కడ స్వామి వారు శ్రీదేవీ భూదేవీ సమేతుడై కొలువుదీరి పూజలందుకుంటున్నాడు.
