దసరా పండుగ ముగిసింది. ఇప్పటి వరకూ దసరా పండుగ జరుపుకునే విషయమై ఎన్నో ఆలయాల గురించి చర్చించుకున్నాం. అయితే ఒక గ్రామంలో మాత్రం దసరా పండుగను మనలా దశమి రోజున నిర్వహించుకోరు. ఇక్కడ అదే ప్రత్యేకత. ఆ గ్రామస్తులు దశమి తరువాత వచ్చే ఏకాదశి రోజున జరుపుకుంటారు. అసలు ఎక్కడుందా గ్రామం? అంటే ఉత్తర బెంగాల్‌లోని బోధన్ గ్రామం. ఉత్తర బెంగాల్లోని రాజ్ వంశీయుల ప్రాబల్యం ఉన్న బోధన్ గ్రామాలన్నింటిలో ఏకాదశి ఉదయం నుంచి దసరా సంబరాలు ప్రారంభమవుతాయి.
ఇక్కడి అమ్మవారిని భండారీ రూపంలో పూజిస్తారు. బైరాగురి, దువార్స్‌లోని అలీపుర్ దువార్‌లోని తూర్పు భోలార్ దబ్రీతో సహా దువార్‌లోని అనేక ప్రాంతాలలో ఏకాదశి రోజున దసరా పండుగ నిర్వహిస్తారు. దీనిలో భాగంగా దుర్గను భండారీ రూపంలో పూజిస్తారు. వాస్తవానికి ఎక్కడైనా దుర్గమ్మ పది చేతులతో దర్శనమిస్తుంది. కానీ ఇక్కడ రెండు చేతులతో దర్శనమిస్తుంది. ఇక అన్ని చోట్ల సింహ వాహనంపై దుర్గమ్మ దర్శనమిస్తుంది. ఇక్కడ మాత్రం పులి వాహనంపై దర్శనమిస్తుంది. జిల్లాలోని అనేక గ్రామాలలో భండారీ దేవిని తమకు సిరిసంపదలతో పాటు సుఖ సంతోషాలిచ్చే దైవంగా పూజిస్తారు.