
పూజల్లో శంఖానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. క్షీర సాగర మథనం సమయంలో ఈ శంఖం బయటకు వచ్చిందని విశ్వాసం. పరమ శివుడికి, లక్ష్మీదేవికి శంఖం చాలా ప్రీతికరమని చెబుతారు. శంఖాన్ని పూజించే వారిపై శివుడితో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుందని నమ్మకం. అంత ప్రాధాన్యత ఉన్న శంఖాన్ని హిందువులంతా తమ పూజ గదిలో పెట్టుకుంటారు. అయితే శంఖాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట. దీనిని ఏ దిక్కులో పెట్టాలో తెలుసుకుని పెట్టాలట.
శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో పాటు ఆర్థిక కష్టాలు సైతం ఉండవని నమ్మకం. పైగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శంఖాన్ని పూరించడం వల్ల మన ఇంట అనుకోని అదృష్టాలు కలుగుతాయట. శంఖాన్ని తూర్పు దిక్కులో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. అలాగే శంఖాన్ని భద్రపరిచే స్థలాన్ని శుభ్రం చేసి ఎరుపు లేదంటే పుసుపు రంగు వస్త్రంపై శంఖాన్ని ఉంచాలట. ఎప్పుడైనా శంఖాన్ని పూరిస్తే ఆ తరువాత గంగా జలంతో శుభ్రం చేయాలట. ఒకవేళ మీ ఇంట శంఖం లేకుంటే దీపావళి కంటే ముందుగానే శంఖాన్ని మన ఇంట తెచ్చి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజిస్తాం కాబట్టి ఆ రోజున శంఖం కూడా ఉంటే మంచిదని అంటారు.
