రామాయణంలో వాలి, సుగ్రీవుల గురించి తెలియని వారు ఎవరుంటారు? కానీ వారి జన్మ వృత్తాంతమే దాదాపు ఎవరికీ తెలియదు. వీరి జననం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. వాలి, సుగ్రీవుల తల్లిదండ్రుల గురించి కూడా చాలా మందికి తెలియదు. వీరి గురించిన వివరాలు రామాయణంలోని చివరి భాగమైన ఉత్తరకాండలో ఉన్నాయి. వాలిసుగ్రీవు జన్మ వృత్తాంతం గురించి శ్రీరాముడికి అగస్త్య ముని చెప్పాడట. మేరు పర్వతం మీద బ్రహ్మ కొంతకాలం యోగాభ్యాసం చేస్తుండగా.. ఆయన కంటి నుంచి ఒక చుక్క నీరు నేల మీద పడి ఒక వానరుడు పుట్టాడట. ఆ వానరుడు అక్కడే తిరుగుతూ పెదిగి పెద్దవాడయ్యాడట. ఒకరోజు మేరు పర్వతం అవతల ఉన్న ఒక సరస్సును చూసిన వానరుడు దాని వద్దకు వెళ్లి తొంగి చూడగా.. అతని ప్రతిరూపం కనిపించిందట.
దాన్ని చూసిన వానరుడు.. చెరువులో కనిపిస్తున్నది మరో వానరుడని భ్రమించి సరస్సులోకి దూకి ఎంత వెదికినా ఎవరూ కనిపించలేదట. అలసట తిరిగి ఒడ్డుకు చేరుకోగానే వానరుడు కాస్తా అందమైన అమ్మాయిగా మారిపోయాడట. వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్లి అదేమిటని అడగ్గా.. ఆ సరస్సు శాపగ్రస్తమైనదని అందుకే నీకు ఇలా స్త్రీ రూపం వచ్చిందని.. పిల్లలు పుట్టగానే తిరిగి మగ రూపం వస్తుందని బ్రహ్మ చెప్తాడు. దీంతో నిత్యం దిగులుగా సరస్సు ఒడ్డున వానరుడు కూర్చొనేవాడట. ఒకరోజు అటుగా వెళుతున్న ఇండ్రుడు, సూర్యుడు అందమైన అమ్మాయి రూపంలో ఉన్న వానరుడిని చూసి మనసుపడ్డారట. వారిద్దరి కారణంగా ఆ అమ్మాయికి ఇద్దరు కవలలు పుట్టారట. వారే వాలి సుగ్రీవులు. ఇక పిల్లలు పుట్టగానే ఆ అందమైన అమ్మాయి తిరిగి వానరుడిగా మారిపోయిందట.