శ్రావణ మాసంలో సోమవారానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా శ్రావణ సోమవారం శుక్ల పక్షంలోని సప్తమి తిథి రోజున శివుడిని మూడు రూపాల్లో పూజిస్తారు. ఇలా పూజిస్తే చాలా మంచిదట. ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుందట. మరి శివుని మూడు రూపాలేంటి? వాటి ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.
నీలకంఠుడు: సముద్ర మథనం సమయంలో హాలాహలం బయటకు వచ్చినప్పుడు శివుడు దానిని స్వీకరించి కంఠంలో దాచేసి గరళ కంఠుడిగా మారాడు. గొంతులో శివుడు విషయాన్ని దాచడంతో నీలం రంగులోకి మారింది. అప్పటి నుండి శివుడిని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. ఇవాళ నీలకంఠుడిని ఆరాధిస్తే శత్రు భయాలు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు వంటివేమీ ఉండవట. ఈ రూపాన్ని దర్శించుకుని.. ఓం నమో నీలకంఠాయ నమః అనే మంత్రాన్ని జపించి.. ఆపై శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయాలట. ఇలా చేస్తే గ్రహాల కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత, శాంతి, సౌభాగ్యం లభిస్తాయట.
నటరాజ స్వామి: నటరాజ రూపం శివునికి సంబంధించిన అద్భుతమైన రూపాల్లో ఒకటి. ఈ రూపంలో శివుడు నృత్యానికి అధి దేవుడిగానూ.. సృష్టి, నిర్వహణ, విధ్వంస చిహ్నంగానూ పరిగణించబడుతున్నాడు. నటరాజ స్వామి ఒక చేతిలో అగ్నిని కలిగి వినాశనానికి చిహ్నంగానూ.. మరో చేతిలో సృష్టి, నాద బ్రహ్మకు చిహ్నంగానూ కనిపిస్తాడు. శివుని నటరాజ రూపాన్ని ఆరాధిస్తే మనిషిలోని సృజనాత్మకత మెరుగుపడటంతో పాటు కళా రంగంలో విజయంతో పాటు వ్యక్తి జీవితంలో శక్తి, సమతుల్యత, శాంతిని పొందుతారు.
మహామృత్యుంజయ స్వరూపం: శివుడు మహామృత్యుంజయ స్వరూపుడు. ఈ రూపం మృత్యు భయం నుంచి మనల్ని రక్షిస్తుందట. శివుని ఈ రూపం అత్యంత శక్తివంతమైన, దయగల రూపాలలో ఒకటి. “ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్” అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుడిని ఆరాధించాలి. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతాయి.