దేశంలో హిందూ ఆలయాలు అసంఖ్యాకం. అలాంటి ఆలయాల్లో కొన్ని ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.అలా ప్రత్యేకతను కలిగి ఉన్న ఆలయాల్లో తమిళనాడులోని ధరాసురంలో ఉన్న ఐరావతేశ్వర ఆలయం ఒకటి. ఇది ఒకప్పుడు చోళుర రాజధానిగా ఉండేది. ఈ ఆలయం చోళుర కాలం నాటి వైభవానికి, శిల్ప చాతుర్యానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ ఐరావతేశ్వరుని ఆలయాన్ని చూస్తే నివ్వెరబోతారు. అసలు ఈ ఐరావతేశ్వర ఆలయం ప్రత్యేకత ఏంటి.. అంటారా? ఐరావతం దేవేంద్రుని ఏనుగని అందరికీ తెలిసిందే.
ఎందుకోగానీ ఒకసారి ఐరావతంపై దుర్వాస మహర్షికి విపరీతమైన కోపం రావడంతో ఏ తెలుపు రంగు చూసుకుని మురిసి పోతున్నావో ఆ తెలుపు రంగు కోల్పోతావని శపించాడట. ఆ శాపంతో దేవ గజం కుంగిపోయింది. తన శాప విమోచనం కోసం ఎన్నో చోట్లకు తిరిగింది. చివరకు ధరాసురంలోని పరమేశ్వరుని పూజించుకొని, అక్కడ ఉన్న కొలనులో మునిగిందట. పైకి లేవగానే ఐరావతానికి తన రంగు తిరిగి వచ్చేసిందట. ఇప్పటికీ అక్కడ ఇంద్రునితో వేంచేసి ఉన్న ఐరావతం మనకు దర్శనమిస్తుంది. ఇక అప్పటి నుంచి అక్కడి శివయ్య కూడా ఐరావతేశ్వరుడు అని పిలవబడుతున్నాడు.