షట్‌తిల ఏకాదశి వ్రత కథేంటో తెలుసా?

షట్‌తిల ఏకాదశి గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. పూజ ఏదైనా.. వ్రతం ఏదైనా పూజా విధి పూర్తయ్యాక ఆ వ్రతానికి సంబంధించిన కథను చదువుకుని అక్షింతలు నెత్తిన వేసుకుంటే వ్రత ఫలం సంపూర్ణమవుతుంది. మరి షట్ తిల ఏకాదశి వ్రత కథేంటో తెలుసుకుందాం. షట్ తిల ఏకాదశి కథ ప్రస్తుత కాలంలో జరిగిన ఘటన కాదు. చాలా కాలం క్రితం జరిగింది. దాదాపుగా ఇది ద్వాపర యుగంలో జరిగిన సంఘటనగా పేర్కొంటారు.

ఒక ఊరిలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ఆమె తన సంపదను దాన ధర్మాలకు పెద్ద ఎత్తున ధనం వెచ్చించింది. అయితే అన్నదానం మాత్రం చేసేది కాదు. దాని విలువ గురించి ఎంత మంది చెప్పినా వినేది కాదు. ఒకరోజు శ్రీమంతురాలికి శ్రీకృష్ణుడు అన్నదానం గొప్పతనం తెలియజేయాలని భావించాడట. ఈ క్రమంలోనే బిచ్చగాడి రూపాన్ని ధరించి ఆమె దగ్గరకు ఆహారం కోసం వెళ్లాడు. యథాప్రకారమే ఆమె అన్నదానానికి నిరాకరించి మరీ అతడిని తరిమికొట్టింది.
అయినా సరే పట్టువదలకుండా తిరిగి వెళ్లి అడిగితే ఆయన భిక్ష పాత్రలో మట్టివేసింది. అప్పుడు ఆ భిక్షకుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ఆమె ఇంట్లోకి వెళ్లిన తర్వాత చూస్తే ఆహారమంతా మట్టిగా మారిపోయింది. తినేందుకు ఏం పట్టుకున్నా మట్టి అయిపోతోంది. రోజులు గడుస్తున్నాయి. తినడానికి ఏది ముట్టుకున్నా మట్టి అవుతోంది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. దీంతో ఆమె శ్రీకృష్ణుడిని శరణువేడింది. అప్పుడు కన్నయ్య ఆమెకు కలలో కనిపించి భిక్షకుని పాత్రలో మట్టి వేసి అవమానించినందున, ఆమెకు ఈ గతి పట్టిందని తెలిపాడు. నిత్యం పేదలకు అన్నదానం చేయమని అలాగే షట్​తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని ఆమెకు ఉపదేశించాడు. నాటి నుంచి ఆమె పేదలకు అన్నదానం చేయడంతో కోల్పోయిందంతా తిరిగి వచ్చింది. అప్పుడు ఆమె షట్‌తిల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సకల భోగాలూ అనుభవించింది. అంతేకాకుండా మరణానంతరం సైతం మోక్షాన్ని పొందింది.

Share this post with your friends