శ్రీహరి అనుగ్రహంతో విప్ర దంపతులు పుత్రసంతానం పొందిన వైనం గురించి తెలుసా? ఇది మాఘ పురాణంలోని 17వ అధ్యాయంలో వివరించారు. విప్ర దంపతుల కథ గురించి గృత్స్నమదమహర్షి జహ్ను, మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. జహ్నువు బుద్ధి చాలా మంచిదని.. అందుకే నీకు శ్రీహరి కథల పట్ల ఆయనకు ఆసక్తి కలిగిందని గృత్స్నమదమహర్షి చెబుతాడు. మాఘవ్రత పుణ్యం వల్ల కలుగు తత్వమును బోధించాడు. పూర్వం గంగా తీరంలో వేదవేదాంగ పండితుడైన బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి నివసిస్తుండేవాడు. అన్ని సద్గుణాలు కలిగిన అతనికి సంతానం మాత్రం లేకుండెను.
ఒకనాడు ఆ బ్రాహ్మణుడు సంతానం లేక విచారిస్తున్న తన భార్యతో తాను తపస్సు చేసి శ్రీహరిని మెప్పించి ఆయన అనుగ్రహం సంపాదిస్తానని చెప్పి గంగా తీరానికి వెళ్లాడు. ఆ బ్రాహ్మణుడు శ్రీహరి కోసం గంగా తీరంలో తన ఎడమకాలి బొటనవేలిపై నిలబడి సూర్యుని వంక తీక్షణంగా చూస్తూ నిద్రాహారాలు మాని కఠోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీహరి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా తనకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. శ్రీహరి అనుగ్రహంతో బ్రాహ్మణుడి భార్య కొన్ని రోజులకే గర్భం దాల్చి నెలలు నిండక ముందే పిల్లవానికి జన్మనిచ్చింది. దీంతో బ్రాహ్మణ దంపతులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.