
శని త్రయోదశి ఎప్పుడో తెలుసుకున్నాం కదా. ఈ నెల 28వ తేదీన మనం శనిత్రయోదశిని జరుపుకోనున్నాం. ఇక హిందూ మత గ్రంధాల ప్రకారం శని ప్రదోష వ్రతం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. పురాతన కాలంలో ఒక వ్యాపారి తన కుటుంబంతో ఒక నగరంలో నివసించేవాడు. అతనికి పెళ్లై ఏళ్లకేళ్లు గడుస్తున్నా సంతానం మాత్రం కలుగలేదు. దీంతో దంపతులిద్దరూ చాలా ఆవేదన చెందేవారు. ఒకరోజు దంపతులిద్దరూ సంతాన భాగ్యం కోసం తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఒక శుభ ముహూర్తం చూసుకుని ఇద్దరూ తీర్థయాత్రకు బయలుదేరారు.
దంపతులిద్దరూ కొంతదూరం వెళ్లాక వారికి ఒక సాధువు దర్శనం అయింది. మహర్షి ధ్యానంలో ఉండటాన్ని చూడగానే దంపతులిద్దరూ ఆయన ఆశీర్వాదం కోసం ఆగారు. కాసేపటి తరువాత మహర్షి ధ్యానం పూర్తైంది. రుషికి దంపతులు నమస్కరించడంతో ఆయన సంతోషించాడు. తమ బాధను రుషికి దంపతులు వివరించారు. వారు పడుతున్న బాధ చూశాక వారికి శని త్రయోదశి ఉపవాసం, దాని ప్రాముఖ్యత గురించి రుషి వివరించాడు. వ్రతాన్ని ఆచరించమని సలహా ఇచ్చాడు. తీర్థయాత్రల నుంచి తిరిగొచ్చాక దంపతులిద్దరూ శని ప్రదోష వ్రతాన్ని ఆచరించి శివుడిని పూజించారు. కొంత కాలానికి వ్యాపారి దంపతులకు సంతానం కలిగింది. శనిత్రయోదశి నాడు నిర్వహించే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది.
