శాకంబరీ దేవి ఉత్సవాలు పలు చోట్ల జరుగుతున్నాయి. శాకంబరీ దేవి ఎవరనేది తెలుసుకున్నాం కానీ ఆమె కథేంటి? దేవీ భాగవతంతో పాటు మార్కడేయ పురాణంలోని చండీసప్తశతిలో శాకాంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది. అసలు పురాణాల్లో ఏముందో చూద్దాం. నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవిస్తుందని అమ్మవారు చెప్పిందట. అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులంతా తనను స్తుతించడంతో వారి కోరిక మేరకు తాను అయోనిజనై అవతరిస్తానని తెలిపిందట. తన శత నయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతానని.. అప్పుడు తనను ప్రజలందరూ శతాక్షీదేవిగా కీర్తిస్తారని వెల్లడించింది.
ఆ తర్వాత తన దేహం నుంచి శాకములను పుట్టించి, మళ్లీ వర్షాలు పడేంత వరకూ జనుల ఆకలి తీర్చి, ప్రాణాలను రక్షిస్తానని తెలిపింది. అలా వర్షాలతో జనులను రక్షిస్తుంది కాబట్టి తాను శాకాంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది. ఈ సమయంలోనే అమ్మవారు దుర్గముడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత జగన్మాత దుర్గాదేవిగా కీర్తించబడింది. మరి శాకంబరీ దేవి ఎలా ఉంటుందంటే.. నీలి వర్ణంలో పిడికిలి నిండా వరి మొలకలు పట్టుకుని.. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని పట్టుకుని అందమైన కమలాసనంపై కూర్చొని ఉంటుంది.