మీసాల వేంకటేశ్వర స్వామివారి గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఈ మీసాల వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గంలోని వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఉంది. వెయ్యేళ్ల కిందట ఓ భక్తుడి కోసం శ్రీ వేంకటేశ్వర స్వామివారు వెలిశారని ప్రతీతి. ఈ ఆలయం కింద 365 ఎకరాల భూమితో పాటు ఇతర ఆస్తులు ఉన్నాయట. కాబట్టి ఈ ఆలయానికి ప్రతి ఏటా ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. అసలు ఈ ఆలయం వెనుక కథేంటో తెలుసుకుందాం.
సుమారు 13వ శతాబ్దంలో కందుకూరు గ్రమానికి చెందిన ఓ భక్తుడు ప్రతి ఏటా తప్పక తిరుమల శ్రీవారిని దర్శించుకునేవాడు. అయితే ఒక ఏడాది తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే శక్తి లేక బాధపడుతూ స్మామివారిని స్మరిస్తూ ఉండిపోయాడట. దీంతో భక్తుడి ఆవేదనకు కదిలిపోయిన వేంకటేశ్వర స్వామి అతని కలలోకి వచ్చి స్వయంగా వెలిశానని చెప్పాడట. తెల్లవారే ఉదయాన్నే ఆ భక్తుడు తనకు కలలో కనిపించిన ప్రదేశానికి వెళ్ల్లాడు. అక్కడ తవ్వి చూడగా వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం దర్శనమిచ్చింది. ఆ తరువాత అక్కడ స్వామివారికి ఆలయం నిర్మించారు. తరతరాలుగా స్వామి వారికి నిత్య నైవేద్యం పెట్టేందుకు వందల ఏళ్ల నాటి నుంచి స్వామి వారికి కందుకూరు గ్రామంలో 365 ఎకరాలు మూడేసి పంటలు పండే భూములను స్వామి వారి ఆస్తిగా రాసి ఇచ్చారు.