
ఇంద్రాది దేవతలంతా కుంటివారుగా మారి స్వర్గానికి వెళ్లలేకపోయిన కథ గురించి మీకు తెలుసా? అదేంటంటే.. పారిజాత పువ్వులను తీసుకురావడానికని ఇంద్రుడు తన దూతను భూలోకానికి పంపించాడు. ఇంద్ర దూత భూలోకానికి వచ్చి పారిజాత వృక్షం దగ్గర పువ్వులు కోస్తూ శ్రీహరి నిర్మల్యాన్ని తొక్కాడు. అంతే అతడు కుంటివాడయ్యాడు. పారిజాత వృక్షం కిందనే నిద్రాహారాలు మాని మూడు రోజుల పాటు అలాగే ఉండిపోయాడు. మరోవైపు స్వర్గంలో మూడు రోజులుగా తన దూత స్వర్గానికి రాకపోవడంతో ఇంద్రుడు.. దేవలోకంలోని దేవతలందరితో సమావేశమయ్యాడు.
అందరూ కలిసి చర్చించిన మీదట దూతను వెదికేందుకు భూలోకానికి వెళ్లేందుకు నిర్ణయించుకుంటాడు. ఇంద్రుడు ఐరావతం ఎక్కి.. కొంత మంది దేవతలతో కలిసి పారిజాత వృక్షం ఉన్న సత్రజిత్తు పుష్ప వాటికకు చేరుకున్నారు. అక్కడ వారిని పారిజాత పుష్పాలు అమితంగా ఆకర్షించాయి. చూసిన వెంటనే ఇంద్రాది దేవతలంతా వచ్చిన పని మరిచి పారిజాత పూలను కోయడం ఆరంభించారు. ఇంద్ర దూత మాదిరిగానే పూలు కోసే సమయంలో పారిజాత వృక్షం కింద విష్ణు నిర్మాల్యానికి దేవతల పాద స్పర్శ తగిలింది. దీంతో వారంతా ఆకాశ గమన శక్తిని కోల్పోయారు. అంతేకాకుండా వారంతా కుంటివారుగా మారిపోయారు. తమ వాహనాలతో సహా ఎటూ కదల్లేక స్వర్గానికి పోలేక విచారించసాగారు.
