లింగం అంటే అర్థమేంటంటే..

శివలింగం గురించి మనకు తెలుసు. పైగా ప్రతి నిత్యం పూజలు నిర్వహిస్తూనే ఉంటాం. మరి లింగం అంటే అర్థమేంటో తెలుసా? ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. క్షీర సాగర మథనం సమయంలో ఉద్భవించిన వాటన్నింటినీ అంతా స్వీకరించేందుకు పోటీలు పడ్డారు కానీ హాలాహలం పుడితే మాత్రం తమకొద్దంటూ తమకొద్దని పరుగులుతీశారు. అప్పుడు శివుడు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుని గరళకంఠుడిగా మారాడు. భక్తులకు సర్వ సుఖాలను, సంపదలను అనుగ్రహిస్తాడు. తాను మాత్రం శ్మశానంలో నివసిస్తాడు. భిక్షాటన చేస్తూ కాలం గడుపుతాడు.

ఇక లింగం అంటే అర్థమేంటంటే.. ‘లిం’ అంటే మన చూపులకు కనిపించకుండా ఉన్నదానిని ‘గం’ (గమయతి) అంటే గుర్తు రూపంలో తెలియజేసేది. అందుకే ఆ లింగంలో సమస్త దేవతలూ కొలువై ఉన్నారని అంటారు. ఆకాశమనే లింగానికి భూమి పీఠమట. అందుకే ఈ లింగాన్ని ‘బ్రహ్మమురారి సురార్చిత లింగం.. నిర్మల భాసిత శోభిత లింగం.. జన్మజ దుఃఖ వినాశక లింగం.. తత్ ప్రణమామి సదాశివలింగం’ అంటూ కీర్తిస్తారు. శివుడు జ్ఞానానికి సంకేతం. పరమేశ్వరుడి మూడవ కన్నును జ్ఞానానికి ప్రతీకగా పిలుస్తారు. అటువంటి శివుని ఆరాధించడమంటే జ్ఞానమార్గాన్ని అన్వేషించడమే.

Share this post with your friends