కాకులకు పిండాలు పెట్టే సంప్రదాయం ఎలా వచ్చిందో తెలుసా?

హిందూ సంప్రదాయంలో పితృ పక్షం సమయంలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి కాకులకు ఆహారమివ్వడం సర్వసాధారణం. కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు కర్మ కాండుల సమయంలో ఇది తప్పక నిర్వహిస్తాం. పిండాలను కాకి ముడితే మరణించిన వారు సంతోషంగా ఉన్నారని అర్థమట. ఈ సంప్రదాయం గురించి రామచరితమానస్‌లో ఒక కథ ఉంది. అదేంటో చూద్దాం. ఒకసారి సీతాదేవి జడను రాముడు పూలతో అలంకరిస్తుండగా.. ఇంద్రుడు, జయంతుడు అక్కడకు వస్తారు. ఆ దృశ్యాన్ని చూసి ఒకింత ఆశ్చర్యపోయిన జయంతుడు.. అసలు రాముడు నిజంగా విష్ణు మూర్తి అవతారమేనా? అనే విషయం తెలుసుకోవాలనుకుంటాడు. వెంటనే జయంతుడు కాకి రూపం ధరిస్తాడు.

శ్రీరాముడిని పరీక్షించాలనే ఉద్దేశ్యంతో వెళ్లి తన పదునైన ముక్కుతో సీతాదేవి పాదాలను గాయపరిచాడు. దీంతో సీతాదేవి పాదానికి గాయమై రక్తస్రావమవతూ ఉంటుంది. అది చూసి శ్రీరాముడికి విపరీతమైన కోపం వస్తుంది. కాకికి గుణపాఠం చెప్పాలని ఓ బాణాన్ని సంధిస్తాడు. రామ బాణం నుంచి తనను తాను కాపాడుకునేందుకు జయంతుడు బ్రహ్మలోకం, శివలోకాలకు పరిగెత్తుతాడు. కానీ బ్రహ్మ, శివుడితో పాటు ఏ దేవుడూ కూడా జయంతుడికి సాయం చేయలేరు. చివరకు తనను రాముడు మాత్రమే రక్షించగలడన్న నిర్ణయానికి వచ్చి ఆయన పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. అప్పుడు రాముడు తన బాణాన్ని నిష్ఫలం చేయలేమని కలిగే నష్టాన్ని తగ్గిస్తానంటాడు. అలా బాణం కాకి వేషంలో ఉన్న జయంతుడి కింటికి తగులుతుంది. ఆ తరువాత రాముడు కాకులకు పిండాలు పెడితే పూర్వీకులు సంతోషిస్తారని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి పితృదేవలకు పిండాలు పెట్టే సంప్రదాయం ప్రారంభమైంది.

Share this post with your friends