దేవాలయాల్లోని విగ్రహాల పరిమాణం, ఇంట్లోని విగ్రహాలు వేర్వేరుగా ఉంటాయి. ఇంట్లో విగ్రహాలను ప్రతిష్టించుకుని పూజలు చేసుకుంటూ ఉంటాం. దేవుడి గదిలో పెట్టే విగ్రహాల సైజు చిన్నగా ఉండాలని చెబుతారు. మనకు నచ్చిన విగ్రహాలను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం కానీ పరిమాణం గురించి పెద్దగా ఆలోచించము. మనం ఇంట్లో దేవుని గదిలో ప్రతిష్టించే దేవుని విగ్రహం పరిమాణం విషయంలో కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. దేవుడి విగ్రహ పరిమాణం గురించి వాస్తు, పూజా నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం.. పూజ గదిలో దేవుని విగ్రహం 1 అంగుళం నుంచి 12 అంగుళాల వరకూ ఉండాలి.
కొందరు తమ ఇళ్లలో 20 అంగుళాల విగ్రహాలు ప్రతిష్టించుకుంటారు కానీ సాధారణంగా విగ్రహాలు 12 అంగుళాల వరకూ మాత్రమే ఉండాలి. ఒకవేళ పెద్ద విగ్రహాలను ప్రతిష్టించుకున్నట్టైతే పక్కాగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విగ్రహాలను పెట్టే దిశ కూడా ముఖ్యమే. దేవుళ్లను బట్టి దిశ మారుతూ ఉంటుంది. విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు మొదలైన విగ్రహాలను దేవుని గదిలో తూర్పు దిశలో ప్రతిష్టించాలి. శివలింగం, దుర్గామాత, గణపతి, కుబేరుడు మొదలైన దేవతల విగ్రహాలను పూజగదిలోని ఉత్తర దిక్కున ప్రతిష్టించాలి. హనుమంతుని విగ్రహాన్ని ఈశాన్య దిశలో ప్రతిష్టించాలి.