తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. టీటీడీ దిట్టంలో లడ్డూ తయారీకి అవసరమైన సరకుల పరిమాణం ఎంతెంత ఉంటుందో తెలుసా? పోటులో దిట్టం ప్రకారం లడ్డూ తయారీ చేస్తుంటారు. 5100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 803 కేజీల ముడి సరుకును వినియోగిస్తారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం.. 5100 లడ్డూల తయారీకి 165 కేజీల ఆవు నెయ్యి, 180 కేజీల శనగపిండి, 300 కేజీల చక్కెర, 30 కేజీల ముంత మామిడిపప్పు, 18 కేజీల ఎండుద్రాక్ష, 8 కేజీల కలకండ, 4 కేజీల యాలకులను వినియోగిస్తారు. అంతే కాకుండా టీటీడీ తన లడ్డూ తయారీ కోసం పేటెంట్ కూడా దక్కించుకుంది. శ్రీవారి పోటులో రోజూ దాదాపు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తారు.
1950లో తొలిసారిగా దిట్టం అనే పేరుతో లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును టీటీడీ ఖరారు చేసింది. ఆ తరువాతి నుంచి భక్తుల సంఖ్య పెరగడం.. దానికి అనుగుణంగా దిట్టం పరిమాణాలను టీటీడీ పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం శ్రీవారి పోటులో ప్రస్తుతం ప్రతి రోజూ మూడు నుంచి మూడున్నర లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. పోటులో 600 మంది సిబ్బంది ప్రస్తుతం పని చేస్తున్నారు. వీరిలో 500 మంది శ్రీవైష్ణవులు కాగా.. 100 మంది కాంట్రాక్ట్ సిబ్బంది శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని నిత్యం తయారు చేస్తున్నారు. టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని 2001లో సవరించిన దిట్టం పరిమాణాలకు అనుకుణంగా తయారు చేస్తూ వస్తోంది.